SIDEBAR
»
S
I
D
E
B
A
R
«
విప్లకారిణి మోహిని
Jul 9th, 2017 by akkirajub

(1999 లో అమెరికాలో ఉన్నప్పుడు తెలుసా గ్రూప్ లో వేసిన పోస్ట్ ఇద్. “నిప్పు పిట్ట, ఎర్ర కుందేలు మరియు అదృశ్యమవుతున్న జాతుల సంతతి” అనే పేరుతో డాక్టర్ V చంద్రశేఖర్ రావు రాసిన కథ గురించి చర్చలో దొర్లిన కొన్ని అభిప్రాయాలకి సమాంతరంగా రాసిన నా అభిప్రాయం ఇది. VCR మనని వదిల్ వెళ్ళిపోయిన ఈ సందర్భంలో దీన్ని వెలికితీసి ఇచ్చిన పరుచూరి శ్రీనివాస్ కి ధన్యవాదాలు.)

విప్లకారిణి మోహిని

ఈ కథ గురించి ఇప్పటిదాకా వినబడ్డ అభిప్రాయాలు ఇవి

– the ‘grief’ is extremely personal. With no social motives, causes, or
consequences. Very intimate and very personal.
– she (Mohini) doesn’t have a life,
– she (Mohini) isn’t a “social” being
– None of her actions add anything “useful” to the
society.
– She (Mohini) doesn’t have a quest.

వాటన్నింటిని కాదనటమే నా ఉద్దేశంగా కాకుండా, నేనేమనుకుంటున్నానో రాస్తాను.

మోహినే కనక సమాజానికి ఏ మాత్రమూ అవసరం లేని, ఉపయోగపాడని వ్యక్తే అయితే, అటువంటి వాళ్ళు కనీసం పదిమందయినా ఆ సమాజంలో లేకపోతే…… వద్దు, నేనటువంటి నిరాశావాదిని కాదల్చుకోలేదు. నా దృష్టిలో పూర్తిగా అవసరమయిన మనిషి మోహిని.

ఆమె బాధ ఏ మాత్రమూ వ్యక్తిగతం కాదు. ఆమె జీవితానికి తప్పకుండా లక్ష్యం ఉంది. ఆమెకి బాధ పడ్డం ఏమీ సరదా కాదు. ఆ బాధలేవీ ఆమె కామె సృష్టించు కున్నవి కావు, ఊరికే ఏడుస్తూ కూర్చోడానికి. అలాంటి పాత్రలు కావాలంటే ఏ “డాక్టరు చక్రవర్తి ” లాంటి సినిమానో తెచ్చుకుని చూడండి. మోహినికున్న బాధ లేవీ అర్థిక సమస్యలో లేక సగటు తెలుగు సినిమా పాత్రలకొచ్చే అపార్థపు ఏడుపులో కావు. అలాగని కథలో ఎక్కడా చెప్పలేదు. ఆమెకున్న సమస్యలన్నీ తనచుట్టూ ఉన్న సమాజంలోనివి. ఇలాగుండేదే సమాజం అని అందరూ అంగీకరించారనే బాధ. అందుకు ఆమె స్పందిచగలదు కనుక ఆమెకి ఆ బాధ. అందుకామె కారణాలనీ, మార్గాంతరాలనీ వెతికే ప్రయత్నంలో ఉంది కనుక ఆ బాధ. అంతేకానీ, ” సరే, కాసేపు నేను బాధపడాలీ, ఇప్పుడో చెడ్డవార్త చెప్పండీ”
అనేది కాదు ఆమె తత్వం.

ఆమెకి ఆనందం, సౌందర్యం, అనుభూతీ, ప్రేమా అన్నీ తెలుసు.

” దీవిస్తున్న తల్లుల్లా అవి మెష్ పై కూర్చుని… ఈ దృశ్యం నాకిష్టం”

” అదృష్టవంతుడివి! నా కలల్లో ఇట్లాంటి సంగీతాలు, సుందరమయిన విషయాలూ రావడం మానివేసి చాలా కాలమయింది! …….. మరణించిన మనుషులు పునరుథ్థానమయ్యే కల కోసం ఎదురు చూస్తున్నాను. “

” ఒక షరతు ! ఇరుకు లాడ్జీ గదుల్లోనో, కక్కసు దొడ్ల పక్కనో, కంగారు, కంగారుగానొ, అట్లాంటిచోట వద్దు! కొంచెం ఆహ్లాదంగా, క్రియేటివ్గా వుండే ప్రదేశం చూడు !”

” మోహిని కళ్ళల్లో పారవశ్యం స్పష్టంగా తెలుస్తుంది. సన్నటి కూనిరాగంలా మొదలుపెట్టి గొప్ప పాటలా రూపాంతరం చెందింది. ” ఎంకి ఎవ్వరంటే…” అంటూ పాటను అందుకుంది “

సరే, ఈ బాధ లేవీ వద్దు, నేనూ ఈ బాధలన్నీ వదిలి అందరిలా ఆనందంగానే ఉంటానూ అంటే, ఖచ్చితంగా మార్గాలున్నాయి. ఓ యండమూరి తులసిదళమో, కోడిరామకృష్ణ బూతు సినిమానో, మధుబాబు షాడో డిటెక్టివ్ నవలో, ఏదో ఒక పాపులర్ బాబానో, దేవుడో, రావుడో… సవాలక్ష మార్గాలు. అదే కథలో చెప్పిన సెమినార్ అలాటిదే. ఆమెకి ఆ మార్గాంతరముందని తెలుసు. కానీ అది ఆమె తత్వం కాదు. అలా పారిపోవటం, ఆత్మవంచన చేసుకోవటం ఆమెకి చాత కాదు. మళ్ళీ చెపుతాను, ఆమెకి బాధలో ఆనదం లేదు. కంటబడ్డ బాధని గురించకుడా ఆమె ఉండలేదు.

” ఈ డెత్ , సఫరింగ్, ఆందోళన, భయం, కోరిక, పోరాటం – నాకు సైనికురాలిగా జీవించడమే ఇష్టం. ఐయామె ప్రొడక్ట్ ఆఫ్ మై టైంస్. ఐ వాంట్ టు బి విత్ టైంస్”

ఇది గుర్తుంచుకోండి, ఆమె సైనికురాలు! అదికూడా, ఇప్పుడు, ఈ కాలాన అది అవసరం కనుక…. product of the time !

నిజమే ఆమెకి (స్వంత) జీవితం లేదు., సామాజిక జీవనమే ఆమె జీవితం. ఆమె ఏమీ సాధిచలేక పోవచ్చు. ఆమెకూడా చెరువుగట్టున శవంలా మిగిలిపోవచ్చు. అలా తనని ఆ శవంలో గుర్తించుకుంది కాబట్టే, ఏమీసాధించకుండా అలానే అర్ధాంతరంగా చావటం ఇష్టంలేదు కాబట్టే ఆమెకంత విషాదం ఆ ఆఖరి చావులో. ఆమెకి తన జీవితమంటూ లేదు. తన చెల్లెలి చావు తనని అంతగా బాధించలేదు…. అది తన వ్యగ్తిగతం మాత్రమే. ఆ ఆత్మహత్యకి కూడా సమజమే కొంతవరకూ బాధ్యురాలయి ఉండవచ్చు. కానీ అలా పనకిరాకుండా చావడం మోహిని లో నిర్లిప్తతని మిగిల్చింది తప్పా, పెద్దగా కదిలించ లేక పోయింది. ఆమెని కదిలించిన చావు ఆఖరిది మాత్రమే!

Yes she doesnot have a life, because she is a social being! కానీ ఆమెని మీరు మామూలు సామాజిక విలువలతోనూ, బంధనాలతోనూ కట్టాలనీ, వెలకట్టాలనీ చూస్తే మాత్రం, ఆమె దొరకదు.

సరే ఆమె వల్ల ఏమిటి ప్రయోజనం అని. ఆమె చాలా అవసరం, ఎందుకంటే, ఈ బాధని గుర్తించగలగటం, గుర్తించి కూడా ఆ సెమినార్ కి వెళ్ళను అని నిర్ణయించుకో కల్గటం…. చాలు, ఇంతవరకూ ఈ తరాన్ని తీసుకురాగలిగితే చాలు, సమస్య సగం తీరిపోయినట్లే. ‘ స్పందన ‘ విప్లవకారులకి ఉండాల్సిన మొదటి లక్షణం. కానీ ఆమె అక్కడే ఆగలేదు. ఆమె తను చేయగలిగిందంతా చేస్తోంది. ” ఆమె బ్యాగ్ తెరిచి లెదర్ ఫైల్ ” తీస్తే ఆమె చేస్తున్న పఠనం, సేకరిస్తున్న విజ్ఞానం కనపడతాయి. ఆమె పరిచయాల ( మోహన సుందరం లాంటి వాళ్ళ) ద్వారా ఆమె ఏంచోస్తోందో ఊహించుకోవచ్చు. ఆమె సైనికురాలినని ముందే చెప్పుకుంది. ఇంకా చదవండి…..

“… మరణించిన మనుషులు పునరుథ్థానమయ్యే కల కోసం ఎదురుచూస్తున్నాను”

ఇన్ని మాటలు చెప్పిన వ్యక్తి, యే ప్రయత్నం లేకుండా అటువంటి కలలొచ్చేస్తాయని నమ్ముతుందా ?? అటువంటి ప్రయత్నం ఏ రూపంలో జరిగినా చూస్టు వూరుకుంటుందా … ఓ మూల కూర్చుని ఏడుస్తూ ? ఆమె ఊరుకోదు, ” మానవ హక్కుల పోరాట సమితి ” ఊరేగింపు ఆమెకి ట్రాఫిక్ సమస్య కాదు, దాని వెంట నడవటానికి ఆమెకి
ప్రత్యేకమయిన ప్రయత్నమూ ఆలోచనా ప్రయత్నమూ అఖ్ఖరలేదు….. ఆమె అందులో పాల్గొనటం అతి సహజం. ఇన్ని కారణాలుగా చెప్పవచ్చు…. ఆమె ఖాళీగా కూర్చోలేదు…. ఆమె విప్లవకారిణి.

ఇన్ని రకాల సందేహాలు రాకుండా రాస్తే ఇంకా బాగుండేదేమో. అదే నేను నా మొదటి మెయిల్లో రాసింది, కథ మరింత వివరంగా వుంటే బాగుండేదేమో అని, రావి శాస్త్రి కథల్లాగా !

– అక్కిరాజు భట్టిప్రోలు
May 5, 1999
Dublin CA
Original Discussion thread :
https://groups.yahoo.com/neo/groups/telusa/conversations/messages/2353

హుద్ హుద్ తుఫాను విశాఖపట్టణం లో ఐ.టి పరిశ్రమ అవకాశాలాను దెబ్బతీసిందా?
Oct 19th, 2014 by akkirajub

 6TV లో నేను పాల్గొన్న చర్చ.  మొదటిసారి టి.వి. తెరమిద.

 

 

అసలు నా మరో పేరు ఆనంద విహారి
Sep 7th, 2014 by akkirajub

బాపు నిష్క్రమణ తర్వాత ఇంటర్నెట్ లో తవ్వుతుంటే ఈ పాట మళ్ళీ బయట పడింది.   చాలా పర్సనల్ ఈ పాట.

నేను తెలివయినవాణ్ణో మూర్ఖుణ్ణో తెలీక మా అమ్మనాన్నా సతమత మవుతున్న రోజులు.  బహుశా ఆ ప్రశ్నకి జవాబు వాళ్ళకి ఎప్పటికీ దొరకలేదనుకుంటాను. వాళ్లకి నేనో అతిపెద్ద సమస్య ఆ రోజుల్లో. నా ఇంటర్మీడియట్ రోజులవి.
విద్యార్థి సంఘాలు, రాజకీయాలు, ఉద్యమాలూ, గోడలమీదరాతలూ, పొగరు, గొడవలు, సాహిత్యం, ప్రజానాట్యమండలి వీధినాటకాలకి డైలాగులు రాయటం,  సినిమాలూ, మళ్ళీ లెక్కలంటే చెప్పలేనంత పిచ్చీ… అన్నీ కలగలిపి ఒకేసారి.  ఊళ్ళో అడుక్కునే వాడినించి, పెద్ద వాళ్ళదాకా అనేక రకాల స్నేహితులు. 

అప్పట్లో ఇదే నా జాతీయ గీతం. అప్పటికీ, ఇప్పటికీ ఇదే నా ఆలోచనలకి తగ్గ పాటనుకుంటాను.

వాటిల్లో ఒక్కొక్కటీ వదిలించుకుని, నన్ను నేను ‘సంస్కరించుకుని ‘ ఓ ‘కెరీర్ ‘ దారిలో పట్టానికి జరిగిందంతా చెపితే, రష్యా పెరిస్త్రోయికాకి తీసిపోని కథవుతుంది.  రిటైరయ్యాక చెప్తా అకథంతా.  ఒకటి మాత్రం నిజం, వెనక్కితిరిగి చూసుకుంటే అప్పుడే ఇంకా బిందాస్ ఉండే వాణ్ణి. ఇప్పుడున్నన్ని భయాలు అప్పుడుండేవి కావు.

ఆ పాట ఇంకోసారి, బాపు స్మృతిలో…

Lyric here నా పేరు బికారి

ఎన్ని మూర్చల్లోంచి ఈ అడవి నిద్రలేపగలదు?
Mar 27th, 2014 by akkirajub


“ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధమ్ములో…” వచ్చిందగ్గర్నించీ ఇదే ఎందుకు పాడుకుంటున్నానో తెలీదు.

ఈ రాళ్ళలోంచి కిందా మీదా పడీ పరిగెట్టే గంగలూ, ఉపగంగలూ ఒప్పుకోవు, ఇక్కడ ఏదన్నా విశాలంగా ఉందంటే.  అడవి ప్రశాంతంగా ఉందంటే ఏ జంతు జాలం ఒప్పుకుంటుంది అడవిలో?  ఇంత జంతు జాలం చుట్టూ ఉన్నాక ఏకాంతంగా ఉన్నాననటం సభ్యత కాదు.  అందుకు ఆపాటని తాజమహల్ కి కేటాయించేద్దాం.

 వంటికి పట్టిన మలినాన్ని కడగగలదేమో గానీ మనిషి మోసుకొచ్చే ఎండిపోయిన అడవుల్ని తిరిగి బతికించగలదా?   లోపల ఉన్న అడావుల్నించి పారిపోలేకా, మోసుకుని తిర్గుతూ, ఏకాంతాన్ని వెతుక్కుంటూ, సంజీవని కోసం ఆశచావక… పిచ్చి నా కొడుకులం!

ఈ అడవి ఓ వింత అద్దం.  అందులో నగ్నంగా కనపడతాం. ఈ రాళ్ళని ఒరుసుకుంటూ రొదగా సాగేనీళ్ళలో జాగ్రత్తగా వింటే ఎంత హేళన నేనంటే! అనుకోకుండా ఎక్కేసిన మెట్లు,  గెలవ లేక పోయిన ఆటలూ, నిలబెట్టుకోలేకపోయిన విలువలూ… అలా చిన్నప్పటి బడిని మళ్ళీ చూస్తున్నట్టు….

, “ఇది నా జీవన పోరాటం” అని గంభీరంగా చెప్పాలనుంది.  ‘You mean fighting for life‘ అని వెకిలిగా నవ్వుతుంది నాకూతురు. రాక్షసి. 

అర్హతకి మించి అధికారాలు అడక్కుండా నియంత్రించే మంత్రం ఏదన్నా ఈ అడవిలో దొరికితే బావుణ్ణు.  ఎన్ని మూర్చల్లోంచి ఈ అడవి నిద్రలేపగలదు?

(గంగా తీరంలో, రిషికేష్ దగ్గర్లో అడవిలో. మార్చి 21, 214 పొద్దున్నే 5.00 గంటలకి ఒంటరిగా రాళ్లమీద కూర్చుని…)

ముగ్గులోకి దిగాక….
Jan 14th, 2014 by akkirajub


“పొద్దున్నే ముగ్గేస్తున్నాం” అల్టిమేట్టం రాత్రే ఇచ్చేసింది భావన.  అప్పటికే అది ఇంటర్నెట్లో దొరికిన సైట్లన్నీ వెతికేసి ఓ నచ్చిన ముగ్గుని నోట్ బుక్ లో ఎక్కించేసింది.సెలవ రోజున పది దాకా ఎలాగూ లేవదు కదా అనే ధైర్యంతో, “అలాగే అయిదింటికల్లా నువ్వు లేచి నన్ను లేపు” అన్నాను.

ఇలా నేను పడుకున్నానో లేదో అలా లేపేసింది “డాడీ, ఇట్స్ ఫైవ్” అని.  ఇంకా చీకటి. చక్కగా ముసుగు పెట్టి పడుకునే చలికాలం. అయినా ఒకసారి మా అమ్మాయి నిర్ణయానికి వచ్చాక ఇంక అది ప్రెసిడెంట్ అసెంబ్లీకి పంపిన బిల్లులాంటిది.  చచ్చినట్టు లేచి స్వెట్టర్ వేసుకుని బయలు దేరాను.

వాళ్ళమ్మ మాత్రం “మీరు ఏడ్చి గీ పెట్టినా లేవను” అని తెగేసి చెప్పింది. సాయంత్రమే వేసుకోవచ్చుగా అన్న తన మాట విననందుకు సహాయనిరాకరణొద్యమం అన్నమాట.

అయినా, ముగ్గు పని ఎప్పుడూ నాకే, మా ఆవిడ కంటే నాకు బాగా ఒచ్చిన అతి కొన్ని పనుల్లో అదొకటి.  మరి మా అక్క చిన్నప్పణ్ణించీ ఇచ్చిన ట్రైనింగ్ అలాంటిది.  “నాకు చెల్లెళ్ళు లేర్రా నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు చెప్పు” అని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి మరీ నా చేత ముగ్గులూ గొబ్బిళ్ళూ పెట్టించిన ఘన చరిత్ర తనది.

మా అక్కంటే అల్లాటప్పా కాదండోయ్! ఏదో గుడివాడలో అలా సింపుల్ గా ఉండిపోయిందిగానీ, బయటకొచ్చిందా… మౌన యోగి మన్మోహన్ తో సంగీత కచ్చేరీ, అతి వాగుడు షారూఖ్ ఖాన్ తో మౌనవ్రతం, విశ్వనాథన్ ఆనంద్ తో 100 మీటర్స్ స్ప్రింట్, టెండూల్కర్ తో మూడు ముక్కలాట ఆడించ గలదు. నేను ముగ్గులెయ్యటం ఓ లెక్కా!

ఇంత చేసి సరే అని సహాయం చెయ్యడానికి వెళ్ళినా, చుక్కలు పెట్టడం, ముగ్గు వెయ్యడం లాంటి పన్లన్నీ తన దగ్గరే పెట్టుకుని, రంగులు నింపడం లాంటి పన్లు మాత్రమే నాకు చెప్పేది.  “చుక్కలు వరసలో పెట్టవు. గీత సన్నగా ఉండాలి” లాంటి చాదస్తాలతో నాకు ఎప్పుడూ under skilled labor కి ఇచ్చే non critical tasks మాత్రమే ఇచ్చేది.   మరీ గొడవ చేస్తే పూర్తిగా వదిలేసి పోతానని గోడ వెనకాలో చెట్ల వెనకాలో ఓ మూడంగుళాల స్థలం చూపించి “అక్కడ నీ సొంత ముగ్గేసుకో” అని చెప్పి మదర్ థెరెసా లాంటి త్యాగ శీలి పోజొకొటి పెట్టేది.

ఇప్పుడు మా ఇంట్లో  నేనే ఆల్రౌండర్ కపిల్ దేవ్ ముగ్గులేయడంలో.

“పద పద” అని భావన హడావిడి పెట్టడంతో కదలక తప్పింది కాదు.  “ముగ్గూ రంగులూ ఉన్నాయా” అంటే “చాక్ పీస్ తో వేద్దాం రోడ్డు మీదేగా” అంది.

సరే కదా అని చూస్తే, విరిగి పోయిన చిన్న చాక్ పీసు ముక్కలు మాత్రమే ఉన్నాయి.  పనమ్మాయి అవి అయిపోయిన సంగతి చెప్పలేదన్న మాట.  ముగ్గు ఇంట్లో లేదని అంతకు ముందే చెప్పింది స్వర్ణ.  భావన మొహం అప్పుడే రంగులు మారి భద్రకాళి పెద్దక్కలా మారడానికి రెడీగా ఉంది. ముగ్గూ లేక, చాక్ పీసులూ లేక ముగ్గెలా వేసేది?

శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అన్నాడు శాస్త్రకారుడు. అర్జంటుగా వంటగదిలో దూరి రెండు కప్పుల బియ్యం తీసి మిక్సీలో వేశా. పదినిమిషాల్లో బియ్యప్పిండి తయారు ముగ్గెయ్యడానికి.  చిన్నప్పుడు వినాయక చవితికి, రథసప్తమికి మా అమ్మ అలాగే బియ్యప్పిండితో దేవుణ్ణి పెట్టే పీట మీద ముగ్గేసేది.  “పోయి అయిదేళ్ళయినా ఇంకా నువ్వే కాపాడుతున్నావే” అని మా అమ్మని తల్చుకుని ఆ బియ్యప్పిండి తీస్కుని బయట పడ్డాను.

గేట్ దగ్గరకి వచ్చి చూస్తే చెట్టు నించి రాలిన ఆకులు దుమ్మూ.  “అబ్బా ఇప్పుడు ఇది ఊడవాలా” అన్నాను.  ఒకప్పుడు ఊడవటం దగ్గర్నించి అన్ని పన్లూ చేసుకునే వాణ్ణి. మనుషుల మీదా, యంత్రాలమీదా అధరపడ్డం అలవాటుపడక ముందు.

ఇంట్లో చీపురు ఎక్కడుంటుందో కూడా తెలీదు. వెతికి తీసుకొచ్చి ఊడవటంలో నా ప్రావీణ్యాన్ని చూపించి, భావనకి కూడా ఊడవడంలో కిటుకులు నేర్పాను.  మొదటి సారి ఈ వంకతో దానికి ఊడవటం, నీళ్ళు చల్లటం అనే రెండు పన్లు నేర్పించే అవకాశం వచ్చింది.

“twenty one  నించి one  దాకా. చుక్కవిడిచి చుక్క” చెప్పింది భావన నోట్ బుక్ చూసుకుంటూ.  చుక్కలు పెట్టడం నా పనే (అక్కా వింటున్నావా?).

చీకట్లో తడువుకుంటూ కష్టపడి చుక్కలు పెట్టాను.  “అది వంకరగా పెట్టావు. ఇది గాప్ ఎక్కువయింది” లాంటి ఫీడ్ బాక్ భావన ఇస్తూనే ఉంది. ఆ అత్తకి ఇది మేనకోడలు కాదూ?

ఒక్కసారి నోట్ బుక్ చూసి మళ్ళీ చూడకుండా ఏక బిగిని వేసి పారేసింది భావన ముగ్గు. “నువ్వు సామాన్యురాలివి కాదే” అన్నా లోపల కొంత ఆశ్చరంగా మరింత ఆనందంగా.

“నేను ఇక్కడ రంగులు మొదలెడతా ఇలోపు ఇంకో ముగ్గు వెతుకు రెండోది కూడా వేద్దాం” అంది భావన, ఒకటి వేసేయగానే వచ్చిన ధైర్యంతో.

హతవిధీ అనుకుంటూ  ఐఫోన్ తీసి ఇంటర్నెట్ లో వెతకడం మొదలు పెట్టా. ఓ నాలుగు సజెషన్లు రిజెక్ట్ అయ్యాక, చివరికి ఒకటి ఒ.కె చేసింది మా అమ్మాయి, పెద్ద హీరో సినిమా కథ ఒ.కె చేసినట్టన్నమాట.

17 చుక్కలు 7 వరసలు తర్వాత చుక్క విడిచి చుక్క 7 చుక్కల దాకా.  మొత్తానికి అది కూడా పూర్తిచేసి చూస్తే, మొదటి ముగ్గులో ఒక్క డబ్బాకూడా పూర్తిగా రంగు నింపలేదు భావన. చాలా తీవ్రంగా అలోచిస్తోంది, ఇన్నింగ్స్ మధ్యలో ధోనీలా.

ఏమిటే అంటే, రంగులు వేసే pattern అలోచిస్తున్నాను అంది.  ఈ లెక్కన రంగులన్నీ వేసే టప్పడికి సాయంత్రమవుతుంది అన్నాను. సాయంత్రం అవలేదు గానీ దాదాపు నాలుగు గంటలు శ్రమించి అయిందనిపించాం.

మా ఆవిడ చివర్లో వచ్చి ఫినిషింగ్ టచ్ లు ఇచ్చి, రంగులేసిన ముగ్గు మీద మళ్ళీ ఔట్  లైన్ వేసి  improvise చేసింది. ఎంతైనా seasoned manager కదా!

ఈ లోపు మా కాలనీలో ఒకరినొకరు పిల్చుకుని మరీ చూసారు, ముగ్గులెయ్యడంలో నా ప్రావీణ్యాన్ని. చూస్తే చూసారు లెద్దూ, మా అమ్మాయి ఒక్క నవ్వు చాలు రోజంతా ముగ్గులెయ్యడానికి!

(జనవరి 14, 2014: సంక్రాంతి)

“క్షమయా ధరిత్రి” – మధ్యతరగతి మహిళ మూడు దశాబ్దాల ప్రయాణం
Jun 30th, 2013 by akkirajub

కొందరు రచయితలకి రావాల్సినంత గుర్తింపు ఎందుకనో రాదు.  కథలు పత్రికల్లో వచ్చినా, కొన్ని బహుమతులు గెల్చుకున్నా, సరయిన విమర్శకుల కళ్ళల్లో పడితే తప్పా, సాహితీ లోకం స్పృహ లోకి రారనుకుంటా.   ముఖ్యంగా, రచన ప్రవృత్తి గా మాత్రమే ఉండి, సాహితీ ప్రపంచానికి దూరంగా ఉంటూ తమ సొంత ఉద్యోగం,జీవనం ప్రధానంగా గడిపే రచయితలైతే మరింత కష్టం.

అలాంటి ఓ రచయిత్రిని, ఆవిడ కథల్ని పరిచయం చేసే ప్రయత్నం ఈ వ్యాసం. చినుకు ప్రచురణల ద్వార వచ్చిన  మద్దాళి నిర్మల గారి కథా సంకలనం “క్షమయా ధరిత్రి”   డిసెంబర్ 23, 2012 వ తేదీన పెద్దిభొట్ల సుబ్బరామయ్యగారి చేతుల మీదుగా  విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించబడింది.

రచయిత్రి దిగువ మధ్యతరగతి కె చెందిన ఓ పెద్దకుటుంబనించి వచ్చింది.  చదువుద్వారా ఉద్యోగం తెచ్చుకుని స్వంతంగా తన దారి వెతుకున్న సమర్థురాలు.  ఆడవాళ్ళు ఉద్యోగాల్లో స్థిరపడ్డ మొదటి తరం అనుకోవచ్చేమో.   ఈ మధ్యనే ఇన్ కం టాక్స్ డిపార్ట్ మెంట్ నించి అధికారిణిగా పదవీ విరమణ చేసింది రచయిత్రి.   రచయిత్రి నేపథ్యం చాలా ముఖ్యం ఈ పుస్తకాన్ని చదివేటప్పుడు.

ఈ పుస్తకంలో మొదటి కథ 1985 లో వచ్చింది. చివరి కథ ఈ సంవత్సరం (2012) జూలై లో వచ్చింది. అంటే దాదాపు మూడు దశాబ్దాల కాలంలో వచ్చిన 26 కథలు ఇందులో ఉన్నాయి. కొన్ని సంవత్సరాల్లో అసలు ఒక్క కథా రాలేదు. కొన్ని సంవత్సరాల్లో ఒకటి కన్నా ఎక్కువ వచ్చాయి.  1995 లో ఎకంగా 4 కథలు వచ్చాయి.

ఇంత కాలం ఓ రచయిత రచనలు చేసి ఒప్పించ గలగాలంటే అది సులభమయిన పనేం కాదు.
ఈ మధ్య కాలంలో సమాజం మారుతుంది. ముఖ్యంగా ఈ ముఫ్పై ఏళ్ళలో మన సమాజంలో వచ్చిన మార్పులు అనూహ్యమైనవి.  ఓ ఫొను కావాలంటే జీవితకాలం వేచి చూడాల్సిన పరిస్థితి నించి మనిషికి ఎన్ని జేబులుంటే అన్ని ఫోన్లు ఉండే స్థితికి చేరాం.  లిబరలైజేషన్, ఐ.టి లాంటి వన్నీ ఈ మధ్యలోనే విప్లవాత్మక మయిన మార్పుల్ని తీసుకువచ్చాయి. కుంభకోణాలు కోటి రూఫాయల స్థాయి నించి వేల కోట్లకి చేరాయి.  విజయవాడ నించి మద్రాసు వెళ్తే గొప్ప అనుకున్న వాళ్ళు, ఏడాదికోసారి అమెరికా వెళ్ళొస్తున్నారు.  మోతుబరి రైతులుగా గౌరవం పొందిన వాళ్ళు ఎ.టి.ఎం దగ్గర సెక్యూరిటీ గార్డ్ లయ్యారు.

అది సమాజంలో వచ్చిన మార్పు అయితే, రచయిత్రి వైపునించి వచ్చే మార్పులూ ఉంటాయి.  అవగాహనల్లో మార్పు వస్తుంది.  ఆవేశాల్లో మార్పు వస్తుంది. కుటుంబ  పరిస్థితుల్లో మార్పులు, కొత్త కొత్త బాద్యతలు.  ఇవి వ్యక్తిగతమైనవి.  అలాగే రచయిత్రిగా, చదివే సాహిత్యమూ, ఉద్యోగినిగా కలుస్తున్న కొత్త కొత్త వ్యక్తులూ, బాధ్యతలూ.

ఇవన్నీ ఎన్నుకునే వస్తువులోనూ, దాన్ని నడిపించే తీరులోనూ, ప్రతిపాదించే ప్రతిపాదనల్లోనూ కూడా మార్పులు తీసుకు రావాల్సి ఉంటుంది.  సాహిత్య రంగాన్ని దగ్గరగా చూసినవాళ్ళకి తెలుసు,  ఎనభై, తొంభై దశకాల్లో బోలెడు కథలు రాసిన చాలా మంది రచయితలు, తర్వాత కాలంలో దాదాపు విరమించుకున్నారని. దానికి కారణం గ్లోబలైజేషన్ సమాజంలో తెచ్చిన మార్పుల్ని అర్థచేసుకునే శక్తి లేక అని మనం అనుకోవచ్చు.

ఆ మార్పుల్ని పట్టుకోవడానికి చాలా ఓర్పు, ఓపెన్ మైండ్, ఎడాప్టబిలిటీ లాటివి అవసరం.

దీనికి మరో వైపు నించి చూస్తే  ఈ రచయిత్రి లాంటి ఆ కాలపు ఉద్యోగిణులకు,  తమ దోవ తాము వెతుక్కోవాల్సి రావడం ఎలాంటి పరీక్షలకి గురిచేస్తుందో మనం ఊహించుకోవచ్చు.  దాని వల్ల జరిగిన మంచి ఏమిటంటే, రచయిత్రి చాలా ఎడాప్టివ్ గా తయారయింది. మధ్యతరగతి ఇంట్లో ఉండే రక్షణ వలయానికి బయటపడి   మార్పులు, కొత్త పరిస్థితులు ఎదురయినప్పుడు,  ఎదుర్కుని ఆకళింపు చేసుకుని ముందుకు పోవడామే తప్పా వెనక్కి తిరిగి చూడలేదు.  ఈ మనస్తత్వమే ఈ రచయిత్రి ని ఇతర రచయితల్లా బెంబేలెత్తిపోకుండా తన  రచనా వ్యాసంగాన్ని కొనసాగించేలా చేసిందని అనుకోవచ్చు.  ఇలా అనుకోవడానికి ఆమె కథల్లో ఉదాహరణలు కోకొల్లలు.

మొట్టమొదటి కథ 1985 లో వచ్చింది.  సాహిత్యంతో పరిచయం ఉన్నవాళ్ళకి వెంటనే స్ఫురించే విషయం,  ఫెమినిస్ట్ సాహిత్యం ఓ స్థిరమయిన స్థానాన్ని సాధించింది 1985 కి 1995 కి మధ్యలో.  అంతకు ముందు గురజాడనించి, చలం నించి రంగనాయకమ్మ దాకా ఎంతో మంది ఉద్దండులు ఈ విషయం గురించి రాసినా, ఓ ఉద్యమ రూపం, ఓ సాహితీ ఉద్యమ రూపం దాల్చింది మాత్రం ఈ కాలంలో నే నని దాదాపు అందరూ అంగీకరిస్తారు.

ఎమిటీ ప్రత్యేకత 1985 కి 95 కి మధ్య? మధ్యతరగతి స్త్రీ ఉద్యోగాలు చెయ్యటం డెబ్భయ్యవ దశకంలో ప్రారంభమయి ఓ స్థిరమయిన స్థానాన్ని ఏర్పరచుకున్నది దాదాపు 75 కి 85 కి మధ్య అనుకోవచ్చు. ఆర్థికంగా, సామాజికంగా  కింది వర్గాల్లో ఉన్న స్త్రీల జీవితాలెప్పుడూ మధ్యతరగతి స్త్రీలకన్నా బాగానే ఉన్నాయి. చేసేది కూలి పనయినా పురుషులతో సమానంగా కాకపోయినా, వాళ్ళకి కావలసినంత సంపాదించుకోగల స్థితిలోనే వాళ్ళున్నారు.  అంచేత వాళ్ళు అవసర మైతే ఇంట్లో వాళ్ళయినా బయట వాళ్ళయినా నువ్వంటే నువ్వనే సబలలు గానే ఉన్నారు, మధ్యతరగతి ఆడవాళ్లతో పోలిస్తే.

పూర్తిగా ఆధారపడ్డ జీవులుగా ఉన్న మధ్యతరగతి అగ్రవర్ణ మహిళలు, మొదటి సారిగా సొంత ఆశల్నీ, తమకి ఇలాంటి జీవనం, జీవితం కావాలి అని ఆశించడం మొదలు పెట్టారు. ధైర్యంగా అది సాహిత్య రూపం కూడా దాల్చింది.

కాకపోతే, సంపాదించడం ఒక్కటే ఆర్థిక స్వాతంత్ర్యాన్నివ్వదు అని పాపం కొంచెం ఆలస్యంగా తెలుసుకున్నారు.  కన్యాశుల్కమయినా, వరకట్నమయినా బాధలు ఆడవాళ్ళకే అని మనకి తెలుసు.  మధ్యతరగతి స్త్రీ సంపాదనతో పాటు మరిన్ని అడ్డంకుల్ని దాటాల్సి వచ్చింది ఆ స్వాతంత్ర్యాన్వేషణ లో భాగంగా.

మొట్టమొదటి కథ ఇందులోది  “ఇది ప్రశ్న ఏది జవాబు”.
ఈ కథలో పద్మ అనే అమ్మాయి కుటుంబ భారాన్ని మోస్తూ ఉంటుంది. తండ్రి బాధ్యతా రాహిత్యంతో పాటు ఇంకో సంసారం కూడా నడుపుతుంటాడు.  ఆ రెండో భార్యని కూడా ఇంటికి తెస్తానంటే ఈ అమ్మాయి ఒప్పుకోదు.  ఇంటా బయటా కూడా ఈమె మొండిదని తండ్రిని వెళ్ళగొట్టిందనీ నిర్ధారించేస్తారు. చివరికి తల్లి కూడా పెద్ద సానుభూతి ఏమీ చూపించదు.

ఇందులో మొట్టమొదట మనం వేసుకోవాల్సిన ప్రశ్న, ఆ పద్మ కూతురు కాకుండా కొడుకయ్యి ఉంటే?  సంపాయించే కొడుకు అచ్చు పద్మలా ప్రవర్తించినా అదేమీ పెద్ద విషయంగా కనపడదు. చిన్న వయసులోనే బాధ్యత వహించిన వాడిగా బోలెడు కితాబులు కూడా వచ్చేస్తాయి.  ఇలా సంపాదన ద్వారా ఆడవాళ్ళకి బాధ్యతలు పెరిగాయి కానీ అధికార బదలాయింపులు తదనుగుణంగా ఏమీ అప్పటికి జరగలేదని ఈ కథ చాలా బలంగా చెప్తుంది.

ఈ అధికారానికి సంబంధించిందే మరొ కథ, అహల్యా శాప విమోచనం. మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే బాధ్యతలకూ, అధికారాలకూ జరిగే చక్కటి విశ్లేషణ.  ఏ సంపాదనా లేని మామగారి భేషజాలకు బలయిపోయే పెద్ద కోడలూ, ఆమె భర్త .  అది చివరికి భర్త మరణించాక కూడా మామగారి అధికారం లో నలిగిపోయే కోడలి కథ.  కోడల్ని సాధించలేక, మనమణ్ణి చేర దీసి వాడి ద్వారా అధికారాన్ని కాజేయాలని చూస్తాడు మామగారు.  సంపాదన మొదలైన తరవాత తమ్ముడి చదువుకు సంబంధించిన వ్యవహారంలో  కూడా తల్లిని ప్రశ్నించే స్థితికి చేరాతాడు పెద్దకొడుకు.  మిగిలిన పిల్లల్ని కూడా పెంచాల్సిన బాధ్యత, దానికి కావల్సిన అధికారం, స్వేచ్చా కోసం మళ్ళీ ఇల్లు దాటే స్త్రీ కథ. గమనించాల్సింది ఇక్కడ, ఆడదానికి ఆర్థిక స్వాతంత్ర్యం, స్వేచ్చ  అన్నవి తన అభీష్టాలకి, జల్సాలకీ అనేకాదు.  తాను చెయ్యాల్సిన పని తన డబ్బుతో చెయ్యడానికి కూడా స్వేచ్చ లేకపోవడం.  ఆడవాళ్ళకి ఆర్థిక బాద్యతల్ని కూడా పంచడానికి చూపించిన “విశాల హృదయం” అధికారం పంచడానికి చూపలేక పోయింది మధ్యతరగతి.

ఇదే విషయాన్ని మరింత బలంగా చెప్పిన కథ “క్షమయా ధరిత్రి”. నిజం చెప్పాలంటే నాకు ఈ మాటంటేనే కొద్దిగా చిరాకు.    ఇందులో ఉన్న స్టీరియో టైపింగ్ (మూస ఆలోచనలని) ని నేను సమర్థించలేను.  ఇలాటి విలువలు ఏవీ మగవాళ్లకి చెప్పిన గుర్తులేదు.  పోనీ ఈ విలువలు కూడా ఆడవాళ్ళు వాళ్ళకోసం ఏర్పరచుకున్నవి కావు. మగవాడికి అనువుగా ఉండేందుకు ఆడవాళ్ళకి కుదిర్చిన విలువలు ఇవి.  “శీలం,పాతివ్రత్యం” అనేవి ఆడదానికి మాత్రమే ఎందుకు గుదిబండ (లయబిలిటీ) అయ్యిందో ఆలోచిస్తే ఈ సూత్రీకరణని కూడా ఎందుకు వ్యతిరేకించాలో అర్థం చేసుకోవచ్చు.

ఇలాటి వాక్యాన్ని తీసుకుని కథ రాసింది రచయిత్రి. అదే పుస్తకానికి కూడా పేరు.  ఈ కథలో ప్రాతివత్యాలని కీర్తించడం, కొవ్వొత్తుల్లా కరిగిపోవటం.. వాటిని ఆదర్శాలుగా చూపడం చేస్తుందేమో అని భయపడ్డం సహజం.   అయితే కథంతా చదివాక అలాంటి ప్రమాదమేమీ లేదని అర్థమవుతుంది. విషయపరంగా ఈ కథ కూడా పై కథలాంటిదే.

ఓ ఉమ్మడి కుటుంబంలో ఓ భార్యా భర్తా అందరి బాధ్యతలు నెత్తిన వేసుకుంటారు.  వదిన సంపాదించింది అనుభవించడంలో లేని సమస్య, వదిన ఖర్చుల గురించీ పొదుపు గురించీ మాట్లాడితే సమస్య అయిపోతుంది.  ఇక్కడా అదే సమస్య. నువ్వు సంపాదించొచ్చు గాక, దానివల్ల నీకు ఒనగూరే ఏ కొత్త ప్రజాస్వామిక హక్కూ అధికారం ఇవ్వడానికి మధ్యతరగతి మనస్తత్వం సిద్ధంగా లేదు.  ఈ కథలో నచ్చే విషయం ఏమిటంటే, అలాంటి స్థితిలో భార్యకి అండగా నిలిచే భర్త. అసంబద్ధంగా ఉన్న మధ్యతరగతి భాగోతాన్ని చెపుతూనే కుటుంబంలో ఉండాల్సిన మానవీయ, ప్రజాస్వామిక విలువల్ని హృద్యంగా చెప్పిందీ కథ.

మధ్యతరగతికి మరో పేరు హిపోక్రసీ…. ఆత్మవంచన.  అది ఏస్తాయిలో ఉంటుందంటే కొన్ని సమస్యల్ని బయటికి చెప్పుకోవడంకూడా కష్టమయ్యేంత.  “మా అత్తయ్య జానకి” అనే కథలో జానకి అనే ఆవిడ పడే బాధ. ఆవిడ భర్త ఆడవాళ్ళతో వెకిలి వేషాలు వేస్తూ ఉంటాడు. ఆయన పరువూ తన పరువూ కాపాడుకోవడానికి ఆవిడ తనకెంతో ఇష్టమయిన అమ్మాయిని కూడా దూరంగా పెట్టేస్తుంది. అందరితో సంబంధాలు తెంచేసుకుని ఒంటరి తనాన్ని మోస్తూ ఉంటుంది.  ఈ కథ చదువుతుంటే అబ్బూరి ఛాయాదేవి గారి కథ “ప్రయాణం” 1965 లో  రాసింది గుర్తొస్తుంది.  అందులో స్నేహితురాలింటికి వెళితే వాళ్ళాయన ఈమెని అర్థరాత్రి సమయం చూసి రేప్ చేస్తాడు.  ఎంత హృదయ విదారకంగా ఉంటుందంటే తెల్లారి స్నేహితులిద్దరూ ఏమీ జరగనట్టు ఉంటారు.  నిజంగా స్నేహితురాలికి తెలీదేమో అనుకుంటుంది.  చివరికి ఆ స్నేహితురాలు “నన్ను క్షమించు, మరీ ఒక్కరోజులో అంత దూరమెళ్తాడనుకోలేదు” అంటుంది.  గమనించాల్సింది, అక్కడ నిస్సహాయంగా ఉన్న స్థాయి నించి “జానకత్తయ్య”  కథ కొచ్చేసరికి కాస్త పరిస్థితుల్ని చేతుల్లోకి తీస్కుని మొగుణ్ణించి తోటి ఆడవాళ్ళని కాపాడే స్థితికి చేరుకుంది భార్య.  అర్థంకాని విషయం ఇంకా ఎందుకు ఇలాటి పెళ్ళిళ్ళని కాపాడుకోవడానికి ఈ ఆడవాళ్ళూ ఇంత కష్టపడుతున్నారని.  ఇది 87 లొ వచ్చిన కథ. బహుశా ఈ రోజున కథ వస్తే అది (మొగుణ్ణి వదిలేయడమే) అతి సహజమయిన పరిష్కారమని తేలుతుందేమో

ఇలాంటి హిపోక్రసీని చెప్పే మరో చిన్న, కొంచెం చిలిపి కథ “ఆమె మనోగతం”.  ఆదర్శప్రాయులం అని చెప్పుకునే వాళ్ళ కొంతమంది ఆదర్శాలు ఎలా ఇంటి గుమ్మందగ్గర ఆగిపోతాయో చెప్పే కథ.  ఓ గొప్ప అభ్యుదయ రచయితని “నువ్వు” అని పిలుస్తాను అని కోరుతుంది ఇందులో ఇల్లాలు.  బాగా నవ్వు తెప్పించే కథ.  చాలా మందికి చెళ్ళున తగిలే కథ ఇది.

ఇప్పటిదాకా చర్చించిన కథలన్నీ 94 కి మూందువి ఒక్క ఆమె మనోగతం తప్పా.  వీటిల్లో సంఘర్షణ ఉన్నా, ప్రశ్నలు వేసినా, ధైర్యంగా ఒక ఆడుగు వేసినా అవ్వన్నీ కూడా సర్వైవల్ కోసమే.  ఇక్కణ్ణించీ వచ్చిన కథల్లోని స్త్రీ పాత్రలు పరిస్థితులు చేయి జారకముందే కదల్టం చూస్తాం. కారణాలు కూడా  సర్వైవల్ మాత్రమే కాదు. ఇష్టాలు, అభీష్టాలూ కూడా.  ఎంచుకునే మార్గాలు కూడా విడాకులు, మళ్ళీ పెళ్ళి, కొత్త జీవితం లాంటి తెగువతో కూడినవి.  ఇది కాలంతో పాటు వచ్చిన మార్పు.

విడాకులు అన్న మాట, ఆలోచన ఈ కథల్లో 94 లో వచ్చిన త్రిశంకు స్వర్గం అనే కథలో మొదటి సారి కనపడుతుంది. నిజానికి ఈ కథ, కొత్తగా దొరికిన అస్త్రాన్ని వాడుకోవటంలో చూసుకోవాల్సిన జాగ్రత్తల్ని చెప్పే కథ. ఈ కథలో రచయిత్రి చూపించే బాలన్స్  పరిపక్వత, ఉన్నతమయిన స్థాయిలో ఉంటాయి.  పెద్దవాళ్ళు చెపితే వినకుండా ఇష్టమొచ్చిన పెళ్ళి చేసుకుని అది పెటాకులు అయ్యాక, నాకేం తక్కువ నేనెందుకు మళ్ళీ చేసుకోకూడదూ అన్న ప్రశ్న ఈ కథలో ప్రధానం.  “విడాకులు సమర్థనీయం” “మళ్ళీ పెళ్ళి కి అందరూ అర్హులే” లాంటి మాటల్ని ముందూ వెనకలు చూడకుండా వ్యతిరేకించడం ఎంత తప్పో సమర్థించడం కూడా అంతే తప్పు.  ఈ కథ రాయడం నిజంగా సాహసమనే చెప్పాలి.  పైపైన చదివితే ఇది ప్రేమ వివాహాలకీ, విడాకులు, మళ్ళీ పెళ్ళికీ వ్యతిరేకమయిన కథ అనే భావం కలగచ్చు.  కానీ ఏ పని చేసినా విచక్షణ, స్వంతంగా బాధ్యత వహించడం నేర్చుకోవాలి అని చెప్పే కథ.  ఆర్థికస్వాతంత్ర్యం వచ్చేసింది సరే కాని దాని ఫలాల్ని సరిగ్గా వాడుకోవాలని చెప్పే కథ ఇది.

ఇక్కణ్ణించి కథల్లో కొంచెం తెగించిన (బోల్డ్) నిర్ణయాలు తీసుకునే పాత్రలు కనపడతాయి. “నాణేనికి అటూ ఇటూ” అనే కథలో ఇంట్లోంచి గెంటేసిన భర్త చనిపోతే చూడ్డానికి వెళ్ళకపోవటం ఓ పేద్ద చర్చాంశం. సవతి కూతురు, సొంత అన్నదమ్ములు కూడా ఆమెని ప్రశ్నించినా ఆమె నిర్ణయంలో మార్పురాదు. ఇలాంటి పాత్ర రచయిత్రి 80ల్లో రాయలేక పోయింది.  కానీ 95 వచ్చేసరికి రాయక తప్పని పరిస్థితి.

అలాగే అనుమానిస్తూ హింసిస్తున్న భర్తనినించి పారిపోయి మళ్ళీ పెళ్ళి చేసుకున్న పాత్ర “తల్లి లేని పిల్లాడు”

ఇలా పాత్రల్లో మరింత తెగువ మనం 94/95 తర్వాత చూస్తాం. ఇది కాలం మార్పు, రచయిత్రి అవగాహనలో మార్పూ.

స్త్రీ ప్రధానంగా ఉన్న విషయాలు దాటిన కథలు రచయిత్రి నించి 93 తర్వాత వచ్చాయి. 1992 లో పి.వి. నరసింహారావు అధికారంలోకి రావడంతోటి దేశంలో,  1995 లో చంద్రబాబు అధికారానికి రావడంతోటి రాష్త్రంలో ఓ కొత్త ప్రభంజనం ప్రారంభమయింది.  కొత్త లిబరలైజేషన్, ఆర్థిక సూత్రాలు మార్పులూ మనుషుల్ని గుక్క తిప్పుగోకుండ చేశాయి.

తెలుగు సాహిత్యం గొప్పతనం ఏమిటంటే, మారుతున్న వస్తువుల్ని ఎప్పటికప్పుడు పట్టుకోవడంలో మన రచయితలు ఎప్పుడూ ముందే ఉన్నారు.  నిర్మలగారు అందుకు మినహాయింపేమీ కాదు.  స్వార్థం, పెరిగిపోయి న డబ్బు పిచ్చి గురించి చెప్పే కథలు 95 నించి ఇప్పటిదాకా రాసిన వాటిల్లో ఉన్నాయంటే యాదృచ్చికమేమీ కాదు.

చదువు వ్యాపారవస్తువయి బడికెళ్ళడానికి భయపడే పిల్ల, పెరిగిపోతున్న అవినీతి లంచగొండులగురించి స్పందించే మరో పిల్లా మనకి 2000  సంవత్సరం తర్వాత కనపడతారు.

బావిని తవ్వించాలా, గుడి కట్టించాలా అన్న మీమాంశలో గుడి, విగ్రహ ప్రతిష్టా ముఖ్యమనుకోవటం ఇప్పుడు జరుగుతున్న చరిత్రని చెప్తుంది.  వచ్చిన అథిదులకి తిండి సరిగ్గా పెట్టలేని మనిషి ప్రదర్శించే ఆధ్యాత్మిక చింతన “ఓ సామాజిక సేవ” రూపు దిద్దుకోవటం నేటి కాలానికి పట్టిన దరిద్రం.  ఈ మనిషి లక్ష్య వత్తుల నోముకు 75000 వత్తులతో తో సరిపెట్టేస్తుంది.  ఈ కథ విశాలాక్షీ విగ్రహ ప్రతిష్టా చదివితే  లక్షలుపెట్టి దేవుడి లడ్డూలు కొనేవాళ్ళూ, వందల అడుగుల విగ్రహాలు పెట్టడానికి చిన్న పిల్లలతో పన్లు చేయించుకునే వాళ్ళూ, బ్లాక్ మనీని కిలోల బంగారంగా మార్చి తిరపతిలో ఇచ్చేవాళ్ళూ కనపడతారు.

ఇంతసేపూ  వస్తువును మాత్రమె ప్రస్తావించాం. ఇక శిల్పం, శైలి విషయానికి వస్తే, అతి సులువయిన వచనం, ముక్కు సూటిగా కథ చెప్పే విధాన్ని మనం గమనిస్తాం ఈ కథల్లో.

అయితే కొన్ని మూస పాత్రలు, అసంబద్ధమయిన సంఘటనలూ లేక పోలేదు. మొట్ట మొదటి కథ “ఇది ప్రశ్న ఏది జవాబులో పక్కింటి జానకమ్మ పాత్ర పూర్తిగా సినిమాలోంచి దిగుమతి చేయబడ్డ మూసపాత్ర.

సంఘటనల్లో కూడా  సినిమా హాల్లో తండ్రి, కాబోయే సవతి తల్లీ మాట్లాడుకొవటం లాంటివి అసహజంగా అనిపిస్తాయి. చిన్నారి కోరిక, అమ్మ నేను స్కూలుకు వెళ్ళనే అనేవి కథలు అనే కంటే వ్యాసాలు అంటానికి సరిపోతాయి. చెప్పాల్సిన విషయానికి తగినన్ని పాత్రలు కానీ సంఘటనలు గానీ లేని రచనలు ఇవి.

స్త్రీవాదులు, స్త్రీవాద రచయితృలు ఎన్నో సార్లు చెప్పుకోవాల్సి వచ్చింది, వాళ్ళు  మగవాళ్ళకి, కుటుంబాలకీ, సంబంధాలకీ వ్యతిరేకులం కామని.  నిర్మల గారికి అలా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అతి సహజంగా మన సంబంధ బాంధవ్యాలు ఎంత ప్రజాస్వామికంగా ఉండాలో స్పష్టంగా మనకి కథలోనే జొప్పించి ఉంటాయి.

మొత్తం మీద, నిర్మల గారి కథా ప్రస్థానం చూస్తే మనకి ఓ మూడు దశాబ్దాల మన కథలు మనకే కనపడతాయి.

మా నిర్మలక్క (పెద్దమ్మగారమ్మాయి) పుస్తక ఆవిష్కరణ సభలో నాక్కూడా మాట్లాడే అవకాశం వచ్చింది. వ్యాసం లాగా మార్చిన ఆ ఉపన్యాసం ఇది.  -అక్కిరాజు

ప్రజాస్వామ్యం
Dec 2nd, 2012 by akkirajub

పాట సగాన పల్లవి మరిచి నట్టు
ఆట సగాన హద్దులు మారిపోయినట్టు
మదిర మత్తులో మొదలు ఎరగనట్టు
చికిత్స మధ్యలో రోగం గుర్తురానట్టు
పరీక్ష ఆఖరికొచ్చాక ప్రశ్నాపత్రం తప్పన్నట్టు
విరామం తర్వాత కొత్త సినిమా పడ్డట్టు
ప్రేమలేఖ చాకలి పద్దుగా పరిణమించినట్టు
పెళ్ళి సామాన్లతో పాటు పాడె వచ్చినట్టు
సితారు ఆఖరి రెండు తీగలు గిటారు వి వేసేసినట్టు 

బంగారంగా మారాల్సిన ఇనుము సంకెళ్ళయినట్టు
సాక్షి, నేరస్తుల బోనులో కనిపించినా ఆశ్చర్యపోనట్టు
నీతికి సాపేక్ష సిద్ధాంతం కలిసి రాజనీతి అయినట్టు

ఈ ప్రజాస్వామ్యం…..
కొవ్వొత్తి ఉద్యమాలు
May 19th, 2012 by akkirajub

ఈ వ్యాసం ది.  08 April 2012  నాడు ఆంధ్రజ్యోతి దిన పత్రిక లో వచ్చింది.     స్నేహితుల కోరిక మేరకు కొన్ని వాక్యాలు సవరించి, తప్పులు దిద్ది   ఇక్కడ  బ్లాగులో వెడ్తున్నాను.

-అక్కిరాజు

————————————————————————————————————————

 

ఈ మధ్య చదువుకున్న యువతీ యువకులు కొవ్వొత్తులతో  వివిధ కారణాలతో ప్రదర్శనలు చేయడం చూస్తున్నాం.   బాంబు పేలుళ్ళ తర్వాత, అన్న హజారేకి సమర్థనగా ను జరిగినవి  మచ్చుకి ఓ రెండు సందర్భాలు.
ఇది శుభ పరిణామమేనా?  నిస్సందేహంగా.  చదువుకున్న మధ్యతరగతి యువత దాదాపు రెండు దశాబ్దాల తర్వాత  ఎంతో కొంత జరుగుతున్న విషయాల పట్ల  స్పందననీ ప్రతి స్పందననీ చూపిస్తుండటం  అభిలషణీయమే.  కాకపోతే ఈ స్పందనల్లో    వారి అమాయకత్వం,  ఈ దేశ నిజ స్థితుల పట్ల ఎంత దూరంగా వీళ్ళ ఆలోచనలు ఉన్నాయో  ఒకటికి పది సార్లు బయటపడుతోంది.
ఈ మధ్య కాలంలో  వచ్చిన అన్నా హజారే  ఉద్యమాన్ని గమనిద్దాం.

ఈ దేశం లో అవినీతి ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. ఆందులో విభేదించేదేమీ లేదు.  కానీ అన్నా హజారే చూపించే “జన లోక్ పాల్”  చాలా బలహీన మైన పునాది మీద ఉంది అని చెప్పక తప్పదు.  ప్రజాస్వామిక వ్యవస్ఠకి సంబంధించిన అన్ని విభాగాల పట్లా పూర్తి  అపనమ్మకం ఈ ప్రతిపాదనలో కనపడుతుంది.   వ్యక్తిగతంగా  హజారే, కేజ్రీవాల్ వంటి వారు త్యాగధనులనీ, వారిని  సమున్నతంగా గౌరవించా లనీ  దాదాపు అందరం అంగీకరిస్తాం.  అయితే సైద్ధాంతిక చర్చలు, ఆ వ్యక్తిగత ధూషణ, భూషణలకు అతీతంగా ఉండగలగాలి.  జన లోక్ పాల్ లో మాట్లాడే “పౌర సమాజం”  అంటే ఎవరు?  దానికి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు?   ఇలాంటి ప్రశ్నలకి జన లోక్ పాల్ లో సమాధానాలు లేవనికాదు.  కానీ అవి ఎంత ప్రజాస్వామికంగా ఉన్నాయని  ప్రశ్నించక తప్పదు.  ఓ ఎమ్మెల్యే, ఎం.పీ గా ఎవరు ఉండాలి అని చెప్పడానికి ఉన్న అధికారం,  సాధారణ పౌరుడికి ఈ “పౌర సమాజపు” ప్రతినిధులను ఏర్పాటు చెయ్యడంలో ఉండదు.    మరి ఇంత అధికారం పౌరులకి ఇచ్చిన ఎన్నికల వ్యవస్థే   అంత మంది నేరస్థులు చట్టసభల్లోకి వెళ్ళకుండా ఆప లేకపోతుంటే, అంత తక్కువ అధికారం  పౌరులకి ఇస్తున్న వ్యవస్థ ఎలా మెరుగ్గా ఉండగలదు? మరో రెండు దశాబ్దాల తర్వాత ఈ కొత్త వ్యవస్థ  ఏ రూపం దాల్చగలదు?

అయినా సరే ఎందుకు ఈ ఉద్యమం ఓ మధ్యతరగతి ఉద్యమంగా మారిందో చూద్దాం.

ఎందుకు మీరు ఎలక్షన్లలో మంచి నాయకుడే ఎన్నికయేలా చూడరు? ఓట్లు వేసి నిజాయితీ పరుల్నే ఎందుకు చట్ట సభలకు పంపరు?  అనంటే వచ్చే సమధానం “ఈ ఎన్నికల్ని డబ్బుతో కొనేస్తున్నారు. మద్యంతో కొనేస్తున్నారు.  డబ్బుకీ, మద్యానికీ, కులానికీ ఓట్లేసే ప్రజ లున్నంత కాలం ఈ వ్యవస్థని నమ్మలేం” అని .
అంటే ఈ మధ్యతరగతి నమ్మని, నమ్మలేని మరో పౌర సమాజం ఉందన్న మాట.  ఈ నడిచే  ప్రభుత్వం వాళ్ళు ఆ మధ్యతరగతి కాని పౌర సమాజం ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం. ఆ  ప్రభుత్వం మీద ఈ మధ్యతరగతికి ఎలాగైనా ఓ పట్టు కావాలి. అందుకే ఆ వ్యవస్థకి సమాంతరంగా మరో వ్యవస్థ కావాలి.

ఒకటి రెండు దశాబ్దాలుగా మధ్యతరగతి రాజకీయాలకి దూరంగా జరిగిపోయింది.  అంతకు ముందు కళకళ లాడిన ప్రభుత్వ కళాశాలలూ, విశ్వవిద్యాలయాలూ  వాటిలో నడిచిన విద్యార్థి సంఘాలూ  ఎంతో కొంత నవతరాన్ని చుట్టూ ఉన్న ప్రపంచం తో సంబంధాలు కలిగి ఉండేలా చేశాయి.  గ్లోబలైజేషన్ ప్రభావం,  కార్పొరేట్  చదువులూ,  వెర్రెత్తిన  పోటీ పరీక్షలూ,  అందొచ్చిన  అమెరికా  మధ్య తరగతికి ఈ రెండు దశాబ్దాల్లో పూర్తిగా ఏ సామాజిక బాధ్యత గానీ అవగాహన గానీ లేకుండా చేసేశాయి.

నిజం చెప్పాలంటే ఈ ప్రజాస్వామిక వ్యవస్థ మీద   నమ్మకం పోయింది మధ్యతరగతి కన్నా ముందు డబ్బు, మద్యం తీసుకుని ఓట్లేస్తున్న కిందితరగతి అసంఖ్యాకులు అని ఈ మధ్య తరగతికి తెలియదు.  రిఫార్మ్ ల పేరుతో  ప్రాథమిక హక్కులు హరించుకు పోతూ వస్తుంటే  ఈ నాగరీకులు గమనించిన జాడ లేదు.  డెబ్బై, ఎనభైల్లో    జిల్లా పరిషత్ పాఠశాలల్లో  చదువు, ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక వైద్యం, ఊళ్ళో ఓ చిన్న గ్రంథాలయం ఉన్న వ్యవస్థనించి  ఎంత దూరం మన పల్లెటూళ్ళు వచ్చాయో ఎవరికి ఎరుక?   “పల్లె కన్నీరు పెడుతుందో ” అని గోరేటి ఎంకన్న హృద విదారకంగా ఏడ్చినా  అలాంటి కవిత్వాలూ, రచనలూ అభివృద్ధి  నిరోధకాలుగానే కనబడ్డాయి.   రెండు నగరాలని కలిపే పేద్ద రహదారి విస్తరణకి  ఓ చిన్న ఊళ్ళో ఉండే ఆసామీ భూమిని ఎలా ఆక్రమిస్తారూ అని అడిగితే అభివృద్ధి నిరోధకులే.   జరిగే “అభివృద్ధి” లో ఏ మాత్రం భాగస్వాములు కాకుండా ఉండి పోయిన ఈ అసంఖ్యాకుల గురించి కావల్సినంత సాహిత్యం వచ్చింది.    కానీ మన మధ్య తరగతి ఆ సాహిత్యాలకీ, ఆ ఆలోచనల కీ కూడా దూరంగా జరిగి పోయింది.

విజన్ 2020 పేరుతో ఇలాటి అభివృద్ధికి ఊత మిచ్చిన మహానాయకుడు పూర్తిగా ఓడి పోయినప్పుడు కూడా ఈ మధ్య తరగతికీ, ఆ మీడియాకీ పూర్తిగా తెలిసి రాలేదు. అ షాక్ నించి ఆ నాయకుడూ, ఈ మధ్యతరగతీ ఇప్పటికీ కోలుకున్నట్టు లేదు.   ఆ స్థానంలో పూర్తి అవినీతి ప్రభుత్వం ఏర్పడ్డా  దానికే మళ్ళీ  యథావిథిగా డబ్బూ, మద్యం తీసుకుని గెల్పించుకున్న ఈ ప్రజా బాహుళ్యపు  దీన స్థితిని  అర్థం చేసుకునే  హృదయ వైశాల్యం, విజ్నత ఈ మధ్యతరగతి ఏనాడో కోల్పోయింది.

“ఈ వ్యవస్థని  జాగ్రత్త గా కాపాడుకుంటే ఆ వ్యవస్థ నన్ను కాపాడుతుంది” అనే నమ్మకం ఉన్నప్పుడు ఆ వ్యవస్థ పట్ల గౌరవం, బాధ్యత ఈ ప్రజల్లో మిగిలి ఉండేది.  ఇలా సమాజంలో కింది స్థాయినించి ఈ వ్యవస్థల పట్ల నమ్మకం పోవడానికి ప్రధాన కారణం ఈ రిఫార్మ్ ల వల్ల ఇంత కాలం ఒక వైపు  జరిగిన విధ్వంసం, మరో వైపు  తాత్కాలిక లబ్ది  పొందిన మధ్య తరగతి.    ఫలితం, ఈ రెండు తరగతులకూ పూర్తిగా ఒకరంటే ఒకరికి నమ్మకం పోయింది.

మరి ఈ రిఫార్మ్ ల వల్ల  ఇంత లబ్ది పొందిన ఈ మధ్యతరగతి ఇప్పుడెందుకు గుండెలు బాదు కుంటోంది?  జరుగుతున్న విధ్వంసం పల్లెటూళ్ళలో నే ఆగిపోలేదు.   వీధికి ఒక చివర ఇల్లు తగలడుతుంటే, మరో చివర ఇంట్లో  మనకెందుకులే అని చూస్తూ  కూర్చుంటే ఏం జరుగుతుందో అదే జరుగుతోంది.    బుగ్గి అయిపోయిన అమెరికా ఆశలు, మృగ్య మయి పోయిన ప్రభుత్వ ఉద్యోగాలు,  పూర్తిగా  కార్పొరేట్ ల పరమయి పోయి ఇప్పుడు మధ్యతరగతి కి కూడా అంద కుండా పోయిన విద్యా వైద్యాలు  ఇదీ నేటి నగర జీవన చిత్రం.  ఓ దశాబ్దం క్రితం  పల్లెటూళ్ళలో ప్రజలు ఏ గగ్గోలు పెట్టారో ఇప్పుడదే గగ్గోలు పెడుతోంది  నేటి నగర మధ్యతరగతి.  ఇదింకా ఆరంభమే అనేది కొద్దిగా లోతుగా ఆలోచిస్తే తెలిసే పచ్చి నిజం.

ఇప్పుడీ మధ్యతరగతికి ప్రభుత్వం పై అజమాయిషీ కావాలి,  బాధ్యత లేకుండా.    వీళ్ళు “అలగా జనం” తో  “లేబర్ గాళ్ళ” తో పని చేసి, వాళ్ళ నమ్మకాన్ని ముందుగా సంపాదించుకుని అందరికీ ప్రాతినిథ్యం వహించే ప్రజాస్వామ్యాన్ని కిందినించి పైకి   నిర్మిస్తారని ఊహించలేం.   అందుకే వీళ్ళకి పైనించి కిందికి నడిచే సమాంతర వ్యవస్థ కావాలి.  లంచాలు, అవినీతి ఏదో ఆకాశంలోంచి హఠాత్తుగా ఊడిపడ్డ  ట్టుగా వీరి ఆలోచనా సరళి ఉంటుంది.  వీటికి ఆద్యం ఈ వ్యవస్థల పట్ల పూర్తిగా నమ్మకం పోయిన జనావళి అని తెలుసుకోలేరు.   కర్రలు పుచ్చుకుని పోలీసుల మీదకి తిరగ బడుతున్న పల్లెటూరి జనం దేశంలో ఎన్ని ప్రాంతాల్లో  కనపడుతున్నా ఇవ్వన్నీ  ఒకే సమస్యకి భిన్న కోణాలు అని తెలుసుకోలేరు.

ఈరోజుల్లో చదువుకున్న వాళ్ళ రాజకీయ చర్చలు వినటానికి కూడా తమాషాగా ఉంటాయి.  కమ్మ, రెడ్డి, కాపు, మైనారిటీ, దళిత ఓట్ల శాతాలూ,  ఊహాత్మక కథలూ, వ్యక్తి పూజలూ తప్ప  ఏ అవగాహనా ఏర్పరచు కోలేక పోయిన, పోతున్న ఈ తరపు నగర యువత కి మరింత లోతైన సామాజిక అవగాహన ఎప్పటికి ఏర్పడుతుందో చెప్పడం కష్టం.  నిజాయితీ గా ఎంతో కొంత బాధ్యత వహిద్దామూ అని వీధిలోకి వచ్చినా వీరికి దారి చూపే నాయకత్వ లోపం మరో పెద్ద సమస్య.  ఆ నిజాయితీ ఇలా కొవ్వొత్తుల ప్రదర్శనల్లో  మిణుకు మిణుకు మని ఆరి పోవడం తప్పా,  దారిచూపే కాగడాల్లా  మారాలని ఆశించడం ప్రస్తుతానికి కష్టసాధ్యం.

కృత్రిమ భావ ప్రాప్తి “లీడర్”
Mar 7th, 2010 by akkirajub

నిన్న లీడర్ సినిమా చూశా.  చాలా డిస్టర్బ్ చేసే సినిమా అని చెప్పచ్చు.  అలా అని ఇందులో నన్ను కొత్తగా ఆలోచింప జేసి, నన్నేదో సంస్కరించే ప్రయత్నం చేసి అలా డిస్టర్బ్ చేసింది అనుకోకండి. ఈ సినిమాని ఇప్పుడున్న సామాజిక సందర్భంలోంచి చూస్తే, చాలా బాధ కలుగుతోంది.

మన సామాన్యుడి సామాజిక నిస్పృహ రెండు గంటలపాటు తెర మీద కాదు, అంతకన్నా ఎక్కువ దాని ముందు కూర్చున్న ప్రేక్షకులలో ఆవిష్కృత మవుతుంటే  నాకు పట్టరాని దుఃఖం వచ్చింది.   ఎవరన్నా సినిమాల మీద తెగ రెసెర్చిలు చేశేవారుంటే వారికి  నాదో సలహా, విన్నపం.  సామాజిక స్పృహ ఉన్న సినిమాలు గత 50 ఏళ్ళలో ఎలా మారాయో గమనించండి.

మరీ దూరం స్వాతంత్ర్యోద్యమ కాలం, స్వతంత్ర భారతంలోని మొదటి రెండు దశాబ్దాల కాలం నాటి సినిమాల గురించిన అవగాహన నాకు లేదు.  పరుచూరి శ్రీనివాస్ చెప్పాల్సిందే.

వాటి తర్వాత వచ్చిన    “మనుషులు మారాలి”, “బలి పీఠం”, “మరో మలుపు” లాటి సినిమాలు  మనుషుల్లో రావల్సిన మార్పుల గురించిన సినిమాలు.  ఆధునిక సమాజంలో  పౌరుడి సంస్కారం ఎలా ఉండాలి, బాధ్యతలు ఎలా ఉండాలి అని చెప్పే చందాన అవి ఉండేవి.

ఆ తర్వాత ఎమర్జెన్సీ కి అటూ ఇటూగా.  సైద్ధాంతిక రాజ కీయాల మీద ప్రజలకి నమ్మకం ఉన్న రోజున విప్లవం సినిమాలు వచ్చాయి.  “ఎర్ర మల్లెలు”, “విప్లవ శంఖం”,  “రంగుల కల”  చెప్పలేనన్ని సినిమాలు.  ఇవి కూడా సైద్ధాంతిక ప్రాతిపదిక మీద వచ్చినా, ఇందులో కూడా సినిమాటిక్  విలన్లే ఉండి, ఆ ఒకళ్ళిద్దరిని సంహరించడమే విప్లవమనీ  చాల అమాయక మయిన పరిష్కారాలు చూపించిన సినిమాలు అవి.   అయినా సరే  ఓ సైద్ధాంతిక ప్రాతి పదికన బాధ్యత వహిస్తూ కలిసికట్టుగా ఉద్యమించే ప్రజలూ, బాధితులూ వాటిల్లో ఉంటారు.

ఆ తర్వాత కాలంలో విద్యార్థి సంఘాలు దాదాపు మూత పడిపోయాయి.  మన రిఫార్ములూ, MNC లూ,   H1 వీసాలూ, కోచింగ్ సెంటర్ లనబడే జైళ్ళూ  ప్రధానంగా విద్యార్థు లని సమాజానికి ఏ బాధ్యత వహించని వాళ్ళగా,  వహించ నవసరం లేని వాళ్ళుగా తయారు చేసాయని మనకందరికీ తెలుసు.   “బాగా చదువుకున్న వాళ్ళే నక్సలైట్లు అవుతారట”   అనే మాటలు చదువుకునే టప్పుడు వినే వాళ్ళం. దానికి భిన్నంగా న్యూస్  పేపర్ కూడా చదవని విద్యార్థులు ఆ తర్వాత కాలంలోనే తయారయారు.

ఈ దశలోనే  రాజకీయానికి బ్లాంక్ చెక్ ఇవ్వబడింది.  విద్యార్థులూ, మధ్యతరగతీ  జరుగుతున్న వ్యవహారాలనించి పూర్తిగా బాధ్యత వహించడం మానేసివన సందర్భం.   ఏ సొంత అభిప్రాయమూ ప్రకటించలేని సందర్భం.    మిస్ యినివర్స్,  మిస్ వరల్డ్ గెలవడం  అభివృద్ది అనుకున్న సందర్భం.    కోక్, పెప్సీలు తక్కువ ధరకే దొరకటం  గురించి మధ్యతరగతి తెగ ఆనంద పడ్డ సందర్భం.   వీటన్నిటి వెనకా రాజకీయం  సామాన్యుడు ఊహించలేని స్థితిలోకి చేరుకున్న వైనం.  కోటి రూపాయల అవినీతి అంటే ముక్కున వేలేసుకున్న వాళ్ళకి “వెయ్యి కోట్లు”  “ఐదు వేల కోట్లు”  లాంటివి మామూలు విషయాలయి పోయాయి.   అంత డబ్బు ఎక్కడ తయారవుతోంది. ఎవడికీ నష్టం లేకుండా అంత ఎలా ఒక చోట చేర గలదూ అనేది  తెలియక కాదు, “మనకి సంబంధం లేని విషయం” అనుకునే వాళ్ళే అందరూ తయారయిన పరిస్థితి ఇది.

ఈ సందర్భంలో కొత్త రకం “మనం బాధ్యత వహించనక్కరలేని” సినిమాలు వచ్చాయి.   సూపర్ హీరో సినిమాలు.    భారతీయుడు, అపరిచితుడు,  రోజా , దిల్సే, స్టాలిన్  లాంటి సినిమాలు.   సర్వం నాశనమయిపోయింది, ఎవడో కథానాయకుడు  వచ్చి  ఏదో  చేయాలి తప్పా మన చేతుల్లో ఏమీలేదనే తిరోగమన వాదాన్ని పెంచిపోషించే సినిమాలు.

అవీ దాటేశాం.   ఆ తర్వాత వచ్చిన  సినిమాలు ఇంకో రకం సూపర్ హీరోలని పట్టుకొచ్చాయి.   వీళ్ళు  NRI  హీరోలు.  స్వదేశ్  షారూఖ్ ఖాన్ లాంటి వాళ్ళన్న మాట.   ఈ లీడర్ ఆ కోవకి చెందిన వాడే.   కుప్ప   కూలిపోయిన  మన ప్రజాస్వామిక వ్యవస్థ లోంచి  బయట పడి, పాశ్చాత్య నాగరిక ప్రపంచాన్ని చూసిన సంస్కారంలోంచి  మనమెందుకు ఇలా లేము అని మథన పడ్డ కొందరు యువకుల అమాయకపు ఆవేశం, నిజాయితీ వీటిల్లో ఉంటుంది.

ఈ ఆలో చనల ప్రమాదం ఏంటంటే,  వీటి వెనక మళ్ళీ తెలియకుండా చెప్పే కొన్ని సూత్రీకరణలుఉంటాయి.    ఇక్కడి సామాన్యుడి మీద నమ్మకం లేక పోవడం.  ఇక్కడి సామాన్యుడు బాధ్యత వహించ నక్కర్లే కుండా కొత్త రకం హీరోల కోసం ఎదురు చూడాలనడం.   ఇలాటివి.   ఎలగూ సూపర్ హీరో  అపరిచితుడు గానీ, NRI  గానీ రాడని మనకి తెలుసు కాబట్టి, మనకి ఖచ్చితంగా మిగిలేది,  నిరాశ, నిస్తేజం.  ఎలాగూ అందరూ దోచేసుకుంటున్నారని నమ్మేశాం కాబట్టి,  ఇక మనమేం చేసినా పర్లేదనే మనకి  పనికొచ్చే వాదం.    రాజ కీయ నాయకుడు ట్రాఫికి ని గంటకి పైగా ఆపగాలేంది, నేను ఈ అర కిలో మీటరు రాంగ్ రూటు లో వెళ్ళి కాస్త ట్ర్ర్ర్రాఫిక్ కి అడ్డం పడితే తప్ప్మేంటి?  వాడు వెయ్యి కోట్లు తినగా లేంది నేను వెయ్యి రూపాయలు తింటే తప్పేంటి?   అప్పుడప్పుడూ ఇలాటి సినిమాలు చూసి, దానికి బాధ్యత ఆ వెయ్యికోట్ల రాజకీయ నాయకుడికీ,  ఎప్పటికీ రాని ఈ సూపర్ హీరో లీడర్ కీ పంచేసి  ఇంటికిపోవడం.    ఇదీ మిగిలేది, ఇలాటి సినిమాల తర్వాత.

ఇన్ని సినిమాల మధ్యలో ఒకే ఒక్క సినిమా నా దృష్టిలో లీడర్  ని చూపించిన సినిమా.  అది రుద్రవీణ.   ఓ వ్యక్తి  విప్లవకారుడవడానికి, మొట్ట మొదట సంఘర్షించేది తనతోనే.   పేలే లాండ్ మైన్లన్నీ తన గుండేల్లో తానే పేల్చుకుంటాడు మొదటగా.   ఆ తర్వాత కుటుంబంతో.  ఆ తర్వాత ఊరితో.  దానికి ఓ ఉద్యమ రూపం వచ్చాక నాయకు డవుతాడు.   చెప్పలేనన్ని  త్యాగాలు చేస్తాడు దారిలో.

తెర మీద ఏం జరిగిందనేది కాదు.   తెర ముందు కూర్చున్న వాడికి మాత్రం కొంత కృత్రిమ భావ ప్రాప్తి ని, మరింత నిస్తేజాన్నీ, బాధ్యతా రాహిత్యాన్నీ నింపే సినిమా ఈ లీడర్.

“ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని ఎదురు చూసి మోస పోకుమా” అని మహా కవి ఏనాడో చెప్పినా మనకి అర్థం అవదు.

నాయకుడు లేని చోట…
Jan 9th, 2010 by akkirajub

ఈ వ్యాసాన్ని ఆంధ్రజ్యోతి జనవరి 10, 2010 ఆదివారం నాడు ప్రచురించింది.

ఈ వ్యాసాన్ని ఆంద్రజ్యోతి లో చదవాలంటే ఇదిగో లంకె! జ్యోతి లో కొద్దిగా ఎడిట్ చేసి వేశారు. పూర్తి పాఠం కావాలంటే ఇక్కడ చదవండి.

-ఆక్కిరాజు

_____________________________________

ఇప్పుడు రాష్ట్రాన్ని చూస్తుంటే, పూర్తిగా బలహీన పడ్డ పునాదుల మీద నిలబడ్డ పేద్ద భవంతిని చూస్తున్నట్టుగా ఉంది. పూచిక పుల్లల మీద నిలబెట్టిన గుండ్రాయి చందం. ఎవడిని ఎవడూ నమ్మడు. నాయకులన బడే వాళ్ళని నమ్ముదామనుకున్నా, వాళ్ళేమి నమ్ముతున్నారో, దేనికి వాళ్ళు చివరంటా నిలబడతారో ఊహించలేని పరిస్ఠితి. భాషతో, పదాలతో ఆటలు. అస్పష్ట ప్రకటనలతో ఆ క్షణాన్ని ఎలాగోలా దాటవేయాలని చూసే అసమర్థ రాజకీయ వేత్తలు.

తెలంగాణా, సమైక్యాంధ్ర సమస్యలకన్నా బాధాకరమయిన సమస్య మనకి ఒకళ్ళో ఇద్దరో నాయకులు లేకపోవడం. నమ్మదగ్గ నాయకులు లేకపోవడం. అసలు సమాజంలోనే నమ్మకం లేక పోవడం, లేకుండా పోవడం.

ఎక్కడో చదివాను. నీతి, న్యాయం అని. నీతి నీకు చెప్పబడ్డ మార్గం. అది చట్టం కావచ్చు, మతం కావచ్చు. న్యాయం అనేది నీ సంస్కారం, నీ విజ్నత (Conscience & wisdom) . ఈ హింస "న్యాయ"మేనా అని అర్జునుడు ప్రశ్నిస్తే, "నీతి" బోధ చేశాడు కృష్ణ్దుడు. ప్రభుత్యాలకు నీతి ఉంటుంది. నాయకులు న్యాయమని పించిన వాటిని సామాజిక నీతిగా, రీతిగా రూపొందించాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో మారుతున్న సామాజిక న్యాయాన్ని ఎప్పటికప్పుడు సామాజిక నీతిగా మారాల్సిన ఆదర్శం దాగి ఉంది.

నాయకుడన్న వాడు తాను నమ్మిన న్యాయానికి కట్టుబడి ఉండగలగాలి. ఇద మిథ్దంగా ఆ సంగతి చెప్పగలగాలి. దానికి అందర్నీ ఒప్పించ గలగాలి. వారందరికీ మార్గదర్శకుడు కాగలగాలి. అది ప్రస్తుత నీతికి ఎదురొచ్చేదయితే, రాళ్ళ దెబ్బలు తినే ధైర్యం ఉండాలి. రాళ్ళు విసిరే జబ్బు కాదు ఉండాల్సింది. ఎక్కడా అలాటి నాయకులు కనపడరేం? "అన్ పాప్యులర్" అయిన ఆలోచన అయినా సరే "అదే నా నమ్మకం" అని చెప్పగలిగే నాయకులు లేని వికలాంగుల ప్రజాస్వామ్యం ఇది.

ఇప్పుడు రాజకీయాలు నడుపుతున్నది రాజకీయ వేత్తలు. నాయకులు కారు. We only have politicians but not leaders. ఈ రాజకీయ వేత్తలు ప్రజల్లోకి చూస్తారు ఏది ఎక్కువ ప్రజామోద్యమయిన మార్గం అని. తమలో తాము చూసుకునే శక్తిలేక. శక్తిలేక అనేకంటే, దానివల్ల వారికి కావల్సిన లాభం లేనందువల్ల అనటం సమంజసం. పైగా అందరి మాటనే తన మాటగా వల్లె వేయడమే ప్రజాస్వామ్యమని నమ్మ పలుకుతారు. తన నమ్మకాన్ని, తన సిద్ధాంతాన్నీ, తన మార్గానికీ ప్రజామోదాన్ని సాధించి దానికి ప్రాతినిధ్యం వహించడమే ప్రజాస్వామ్యమని చెప్పే నాథుడు లేడు. అందుకే సమాజం రెండుగా అంతకన్నా ఎక్కువగానో చీలిపోయి, ఆవేశాలు బజారులోకి చేరాక, ఇలాటి రాజకీయ వేత్తలకి ఏంచేయాలో తోచదు. స్వంతగా ఓ మార్గం లేని వాళ్ళు ఎక్కడ కక్కడ, ఎప్పటి కప్పుడు ఓ మార్గాన్ని వెతుకులాడతారు, అందరి ఓట్లకోసం. అది సహజంగా ఎవరికీ రుచించని పస లేని మార్గమే అవుతుంది. లేదా అస్పష్టతలతో పరిస్థితులని జటిలంచేసే వెర్రి ప్రయత్నమన్నా అవుతుంది. "ఇప్పుడంతా ప్రజల చేతుల్లోకి పోయిందీ" వాళ్ళు చెప్పిందే మేము చేస్తున్నాము అనే వాడు నాయకుడుగా ఆత్మ హత్య చేసుకున్నట్టు, ఒకవేళ ఏనాడయినా నాయకుడయి ఉండి ఉంటే. అదే పరిస్ఠితి వస్తే నిజమయిన నాయకుడు అన్నిటికీ రాజీనామా చేసి, ఇంట్లో కూర్చోవాలి.

కావలసింది ఇప్పుడు కాస్త వెన్నెముక ఉన్న నాయకులు. ఏది తాను నమ్ముతున్నది. ఎందువల్ల అదే అనుసరణీయం అని చెప్పగల నాయకులు. అలాటి నాయకులు అలాటి భావాలూ బయటకు వస్తే, ఏ ఆలో చన వెనక ఎందరున్నారో తెలుస్తుంది. అప్పుడేమి జరిగినా బాధ ఉండదు. కాసిని తక్కువ బస్సులు తగలబడతాయి. కాసింత తక్కువ మంది ఆహుతయి పోతారు. అలాటి ఖచ్చితత్వాన్ని ప్రదర్శించ గలిగిన నాయకుల వల్ల నమ్మకం అనేది కలుగుతుంది. నాకు హిందీ జాతీయ భాషగా ఉండడం ఎంత మాత్రమూ రుచించని విషయం. ఆ విషయంలో కొన్ని తరాల క్రితం ఎన్నో ఉద్యమాలు రెండు వైపులా జరిగాయి. కానీ మొరార్జీ దేశాయ్ మాత్రం దాన్ని చివరంటా సమర్థిస్తూనే ఉన్నాడు. ఆ ఆలోచన పట్ల నాకు ఎంత వ్యతిరేక భావం ఉన్నా, మొరార్జీ ని దేశ నాయకుడు అని నేను అంగీకరిస్తాను.

అయినా అలాటి నాయకులని ఆశించే అర్హత మనకి లేదేమో. వాళ్ళు కూడా మనలోంచి ప్రజల్లోంచి రావాల్సిందే కదా? మన మెంత నమ్మ కస్తులమో ఆలో చిద్దాం. ట్రాఫిక్ పోలీసు వాడు లేకపోతే మనకి సిగ్నల్ రంగులు కనపడవు. ప్రతీ పౌరుడూ బాధ్యతగా ఉండాలంటే, ప్రతి పౌరుడి వెనకా ఓ పోలీసు వాడుండాలి. 60 లక్షల ప్రజలున్న నగరంలో 30 లక్షల మంది సాధారణ పౌరులు, 30 లక్షల మంది పోలీసులు. (పోలీసులంతా నమ్మకస్తులని కాసేపు అనుకుందాం). రోడ్ల మీద అంతా చెత్త పేరుకు పోతోంది అని గొడవ చేస్తే, ఓ కార్పొరేషన్ అధికారి టి.వి లో అన్నాడు. కొన్నిలక్షల మంది చేస్తున్న చెత్తని కొన్ని వేల మంది మున్సిపల్ పని వాళ్ళు ఎప్పటికీ శుభ్రం చేయలేరు అని. పౌరులు రోడ్ల మీద చెత్త చేయకుండా ఉండటం ఒకటే మార్గం. ఆ బాధ్యత లేని పౌరులు, శుభ్రమయిన వాతావరణానికి అర్హత లేని వాళ్ళవుతారు.

అదే రకంగా మనకి ఏ రకంగా చూసినా పక్కవాణ్ణే కాదు, ఎవడిని వాడే నమ్ముకోలేని పరిస్థితి. దిగువ మధ్యతరగతి నించి వచ్చిన నాలాటి వాడికి ఉదాహరణలుగా చెప్పడానికి అజరుద్దీన్ లాటి వాళ్ళని చూపించే వారు. ఓ సాధారణ మధ్యతరగతి లో పుట్టి, దాదాపు ప్రపంచంలోనే ఓ ఉన్నత స్థాయి క్రికెటర్ గా మారగల అకుంఠిత దీక్ష, శ్రమ, పట్టుదల చూపించగలిగిన అజరుద్దీన్ కథ ఎవరికయినా ఆదర్శం కాదగ్గ్గది. విద్యార్థి దశలో కథలు కథలు గా అజరుద్దీన్ గురించి వినడం నాకు గుర్తు. అలాటి కథానాయకుడు ఒక్కసారిగా మొత్త్తం దేశాన్నే మోసం చేశాడు అని ఋజువయితే, నా బోటి విద్యార్థులకు ఎటువంటి అపనమ్మకం సమాజం పట్ల ఏర్పడుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

గ్లోబలైజేషన్ అన్నారు. కొత్తరకం హీరోలు వచ్చారు. ఇక్కడంతా ఏ మాలిన్యం అంటని మల్లెపువ్వులు అన్నారు. అలాగే అనుకున్నాం. మధ్యతరగతికి అదో కొత్త అందుబాటులోకి వచ్చిన ద్రాక్ష తోట. వాళ్ళ బొమ్మల్ని అన్నింటా ప్రచురించి కొలిచాం. మన రాజకీయ వ్యవస్థ కి దాదాపు సమాంతరంగా వీళ్ళే మరో కొత్త భారతదేశాన్ని నిర్మిస్తున్నారు, వీరే కొత్త హీరోలనుకున్నాం. అంతట్లోనే రామలింగరాజు గారు ఆ నమ్మకాన్ని కూడా కూల్చేశారు.

అసలు ఈ తరం అంతా ఇంతే. విలువల గురించి తెగ ఊదరగొట్టే పాత తరమే కాస్త నయమేమో ననుకున్నాం. స్వాతంత్ర సమర యోధుణ్ణనీ ఆ విలువలన్నీ వొంట పట్టించుకున్నాననే చెప్పే అందరికంటే సీనియర్ అయిన గవర్నర్ గారి రాసలీలలు ఆ నమ్మకాన్ని కూడా వమ్ముచేసేశాయి.

పోనీ వీళ్ళేదో వేళ్ళమీద లెక్క పెట్టగలిగిన వాళ్ళు, దాన్ని జెనరలైజ్ చేసి అందర్నీ నమ్మక ద్రోహులూ అనే జాతి నింద చేస్తున్నానను కోవచ్చు. అలా స్టీరియో టైపులు తయారు చెయ్యద్దని నేనే మరో వ్యాసం రాసి ఉన్నాను. నేను చెప్పదలుచు కున్నది, హైదరాబాదు కు దాపు రించిన ఓ ప్రత్యేక మయిన పరిస్థితి. ఎవరైతే (గవర్నర్ తప్పించి) ఈ నగరానికి వన్నె తెచ్చారని భావించామో వాళ్ళే ఈ నగరానికి నమ్మదగనిది అని చూపించారు. ఓ టెండూల్కర్ ముంబయికి, డ్రావిడ్ బెంగళూరు కి, శ్రీకాంత్ చెన్నయ్ కి దొరికి, మనకి మాత్రం అజహరుద్దీన్ దొరికాడు. ఆట విషయంలో వాళ్ళందరి సరసనా నిలవగలిగిన అజహరుద్దీన్, మనకి చేసింది సామాన్యమయిన అన్యాయం కాదు. అలాగే, ప్రేమ్ జీ, నారాయణ మూర్తి, దొరై లకి బదులు మనకి రామలింగరాజు దొరికాడు.

ప్రొఫెషనల్స్ నించి మనం ఆశించేది నీతి. నాయకులనించి ఆశించేది నీతి తో పాటు, న్యాయం. గోపీచంద్, సానియా మిర్జా, వి.వి.యస్. లక్ష్మణ్ లాంటి మంచి ముత్యాలు కూడా ఉన్నాయని నాకు తెలుసు. కానీ ఒక్క విషపు చుక్క చాలు అని మనకు తెలుసుగా. వీళ్ల మీద ఏ అపవాదూ లేకపోయినా, వీళ్ళని కూడా మనం ఎంతో కొంత అనుమానంగానే చూట్టం నేర్చుకున్నాం. ప్రపంచంలో మరెక్కడా లైఫ్ స్టల్ లాంటి షాపుల్లోకి వెళ్ళేటప్పుడు సంచులు బయట పెట్టి టొకెన్ తీసుకెళ్ళాల్సిన పని ఉండదు. ఒక్క మన హైదరాబాద్ లోనూ, బారత దేశంలోనూ మాత్రమే ఈ పరిస్ఠితి. రైల్వేస్టేషన్ లో స్టీలు గ్లాసులకి చైన్లు కట్టాల్స్లిన అవసరానికి దీనికీ పెద్ద తేడాలేదు.

పెద్ద పెద్ద హోదాల్లో ఉండి, ఆఫీసు పనులమీద హోటళ్ళలో ఉండి తుళ్ళూ, సబ్బులూ ఎత్తుకొచ్చే వాళ్ళు మనకి చాలా మందే తెలుసు. ఒక వింత స్థితికి చేరాం మనం. ఎవణ్ణి ఎవడూ నమ్మలేని వికృత శూన్యంలో ఉన్నాం. నీతి కోసం, న్యాయం కోసం చూపించ దగ్గ ఉదాహరణలు లేని పరిస్థితిలో ఉన్నాం. లేరని కాదు. నమ్మకం పోగొట్టుకున్నాం. ఫలానా వాడు కాచ్ డ్రాప్ చేస్తే "ఎంత పుచ్చుకున్నాడో" ననే అనుమానం. ఓ రాజకీయ వేత్త "ఇక నించీ నేను తెలంగాణానే సమర్థిస్థాను" అంటే వీణ్ణి మరెవడో కొనేశాడు అంటాం.

ఈ పరిస్థితికి ఎవర్ని బాధ్యుల్ని చెయ్యటం? మన లెంపకాయల మీద చాచి కొట్టి బుద్ది చెప్పే ఓ నాయకుడు కావాలి. ఓట్లు వచ్చినా పోయినా తన మార్గాన్ని నిర్థుష్టంగా చెప్పగలిగిన ఓ నాయకుడు కావాలి. ఒంటరిగా, ఎవ్వరూ లేనప్పుడు కూడా రెడ్ లైట్ దాటని పురః ప్రజలు కావాలి. అప్పుడు తెలంగాణా సమస్యలాంటి సమస్యలకి ప్రజాస్వామికంగా ఎలా పరిష్కారం కనుగొన వచ్చో మనకి తెలిసి వస్థుంది. అంతటి హృదయ సంస్కారం ముందు మనలో, మామూలు మనలో వస్తే, మనలోంచే అలాంటి నాయకులు వస్తారు. అప్పటి దాకా… ఈ బస్సులు ఇలా తగల బడుతూనే ఉంటాయి.

»  Substance:WordPress   »  Style:Ahren Ahimsa